ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహారంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని మంత్రి పొంగుటేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. మరి అలాంటి కేసును లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్(KTR) మాట్లాడటం విడ్డూరమని మండిపడ్డారు. మంత్రులు చెబితేనే తాము చేశామని అధికారులు ఏసీబీ, ఈడీ విచారణలో స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు. ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
ఎవరి పట్ల తమ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించబోదని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగేసిన వారిని మాత్రం వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు ఇష్టానుసారంగా తప్పులు చేసి తామేదో గొప్పలు చేశామని చెప్పుకోవడం సిగ్గేచేటని ఎద్దేవా చేశారు.
ఇక ‘రైతు భరోసా'(Raithu Bharosa) అమలు విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి డబ్బులు తప్పకుండా చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.