తెలంగాణ ప్రజలకు ప్రముఖ నిర్మాత, TFDC చైర్మన్ దిల్ రాజు(Dil Raju) క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఆంధ్ర వాళ్ళు సినిమాలకు వైబ్ అవుతారు. మన తెలంగాణలో కళ్ళు, మటన్‌కి వైబ్ అవుతారు” అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
వీడియోలో ఏం చెప్పారో అయన మాటల్లోనే..
“తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. FDC రాజకీయాలకు వేదిక కాదు. FDC సినిమాలకు మాత్రమే ఉపయోగపడేలా చేస్తాం. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా FDC ఛైర్మన్ అయ్యాను. నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్కడ చేశాను. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్స్ జరగవు. ఆ ఈవెంట్‌లో నేను మన తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ తెల్ల కల్లు, మటన్ గురించి మాట్లాడాను. తెలంగాణ వాళ్లను నేను అవమానించానని, హేళన చేశానని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టారు. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలవుతుండటం వల్ల నేను తెలంగాణ దావత్ మిస్ అవుతున్నానని, సినిమా రిలీజ్ అయ్యాక తెలంగాణ దావత్ చేసుకుంటానని చెప్పాను.
నా మాటలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు రాద్దాంతం చేస్తున్నారు. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను. బాన్సువాడలోనే ‘ఫిదా’ సినిమాని తీశాను. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని ఫిదా సినిమా తీసుకెళ్లింది. ‘బలగం’ సినిమా తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. తెలంగాణ ప్రజలు మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ సినిమాని అభినందించారు. తెలంగాణ వాసిని అయిన నేను తెలంగాణను ఎలా హేళన చేస్తాను. నా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణలు” అని తెలిపారు.