ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ (Kannauj railway station)లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. కాగా కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.