సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌లో ఈత కొడుతూ ఐదుగురు యువతలు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో గల్లంతై ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని గల్లంతైన వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని సీఎం తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ సాగర్‌కు వచ్చారు. సరదాగా ఈత కోసం నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.