అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే కోడి గుడ్ల నాణ్యతపై అనుమానాలు, భయాలున్నాయి. చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పంపిణీ చేసిన గుడ్లలో పురుగులు ఉన్నాయన్న అనుమానంతో గుడ్లను పగలగొట్టి చూడగా పురుగులు బయటపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నా బాలింతలు, గర్భణీలు నివ్వెరపోయారు. ఇలాంటి గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండడం కాదుకదా ఉన్న ప్రాణం కాస్త పోతుందని వారు మండిపడ్డారు. ఈ ఘటన దేవరకొండ మండల పరిధిలోని కొమ్మేపల్లి అంగన్వాడి కేంద్రాల్లో వెలుగు చూసింది.
కమీషన్ల కక్కుర్తిలో కుళ్లిన
మండలంలో తరచుగా ఇదే తంతు జరుగుతున్నా కాంట్రాక్టర్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లకు ఆశపడే అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అంగన్వాడీని నిలదీయడంతో గత మే నెల 22వ తేదీన కాంట్రాక్టర్ తమకు గుడ్లను సప్లై చేశాడని, కాంట్రాక్టర్ను అడగండి మా ఒక్క సెంటర్ లోనే కాదు మిగతా సెంటర్లో కూడా ఇలానే వస్తున్నాయి అంటున్నారని వివరించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి గుడ్డుపై ప్రభుత్వ లోగో ముద్రతో సరఫరా చేసేలా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
కాంట్రాక్టర్ తో అధికారుల కుమ్మక్కు?
సంబంధిత జిల్లా అధికారులు గుడ్ల కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపుల కోసం అతను కుళ్ళిన తక్కువ పరిమాణం ఉన్న గుడ్లు సరఫరా చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గుడ్లు నాసిరకంగా ఉన్నాయని సరఫరా చేసే వారిని అడిగితే తమకు సంబంధం లేదని ఇచ్చిన గుడ్లు తీసుకోవాలని కసురుకుంటున్నారని తెలిపారు. దీంతో అంగన్వాడి టీచర్లు ఏమీ అనలేక గుడ్లు తీసుకుంటున్నారని సమాచారం.
కాంట్రాక్టర్ నిర్వాకం వల్లే ఇలాంటి ఘటనలు: సీడీపీఓ
ఈ విషయంపై అంగన్వాడి సీడీపీఓ వివరణ కోరగా, ఈ విషయంపై అనేక మార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు లేదన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సప్లై చేసిన గుడ్లపై అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని టీచర్లు గుడ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని అంగన్వాడి సీడీపీఓ అన్నారు.