కాకి.. డేగ.. నెమలి.. కౌజు.. మైల.. ఇవన్నీ ఏంటని చూస్తున్నారా? కోడిపందాల్లో కాలుదువ్వే జాతులివి. ప్రతిసారి సంక్రాంతికి నాలుగైదు రోజుల ముందు నుంచి మొదలయ్యే కోడిపందాల హడావుడి.. ఈసారి ఇంకాస్తా ముందుగా మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ కోండిపందాలకు క్రీజ్ ఎక్కువ. కొన్నేళ్లుగా ఈ సందడి చాలా ప్రాంతాలకు విస్తరిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు పాకింది.
పౌరుషాలకు, పంతాలకు ప్రతీకగా కోడి పందాలను భావిస్తారు. ఇప్పుడు ఈ పందాలు కోట్లు కుమ్మరించే వ్యాపారం. కోళ్ల అమ్మకాల నుంచి బరిలో దింపే కోడిపుంజులపై, కాసే పందాల వరకూ చాలా హంగామా ఉంటుంది. రానురాను హంగులు, ఆర్భాటాలు ఎక్కువవుతున్నాయి. కోడిపందాల బరుల పక్కనే పేకాట, గుండాట, మద్యం అమ్మకాలు.. ఇవన్నీ పెద్ద ఎత్తున సాగుతాయి. ఎప్పుడో 90ల ప్రారంభంలోనే కోడిపందాల్లో కార్లు బహుమతిగా పెట్టేవారంటే ఇవి ఎంత పెద్ద ఎత్తున సాగుతాయో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా సగటున ఏడాదికి దాదాపు రూ.300 కోట్లకు తగ్గకుండా పందాలు సాగుతున్నాయి. 2024 జనవరిలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. గత సంవత్సరం ఒక్కసారు రూ.500 కోట్లు చేతులు మారాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంటివాళ్లు దగ్గరుండి మరీ పందాలు వేయిస్తుంటారు. ఆయన నియోజకవర్గ పరిధిలోని కొప్పాక తదితర ప్రాంతాల్లో బరులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇవన్నీ చూసుకుంటే ఈసారి ఎంత లేదన్నా దాదాపు రూ.800 కోట్ల మేర కోడిపందాలు సాగుతాయని అంచనా.
పందేలకు ముందు హెచ్చరికలు
ఏటా కోడి పందాలను అడ్డుకుని తీరుతామంటూ పోలీసులు హెచ్చరిస్తుంటారు. పండగకు కొద్దిరోజుల ముందు కాస్త హడావుడి చేస్తారు. కానీ, ఆ మూడు రోజులు మాత్రం పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలోనే పందాలు జరుగుతున్న చూసీచూడనట్టు ఉంటారు. ఆర్థిక, రాజకీయ వ్యవహారాలతో ముడిపడిన కోడి పందాల విషయంలో నియంత్రణ దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది.
లక్షల్లో ఆదాయం
పందాల కోసం కోళ్లు, కత్తులు సిద్ధం చేయడం లాంటి వృత్తుల్లో వందల మంది ఉన్నారు. ఏడాది పొడవునా కోళ్లను పందాల ప్రక్రియలో అనేకమంది ఉపాధి పొందుతున్నారు. పందెం కోడిని గుర్తించడం, దానికి తగిన ఆహారం అందించడం, కసరత్తులు చేయించడం, పందాలకు పురిగొల్పడం ఓ విద్య. అది తెలిసిన వారికి గ్రామాల్లో గిరాకీ కూడా ఉంటుంది. పందాలకు బరుల ఏర్పాటు, ఆ ప్రాంతంలో తినుబండారాలు, మద్యం షాపుల నిర్వహణతో పాటుగా అవకాశం ఉంటే గుండాటకి సిద్ధం చేయడం లాంటివి పెద్ద వ్యవహారాలు. వాటి ద్వారా కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఇంతేకాదు ఆ పక్కనే భారీ సంఖ్యలో బెల్టుషాపులు కూడా నిర్వహిస్తారు. వీటికోసం పెద్ద మొత్తాల్లోనే డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది లక్షల్లో జరిగే వ్యాపారం.
బరులు.. పలు రకాలు
బరులు పలు కేటగిరీలుగా ఉంటాయి. పెద్ద బరులు అంటే బడా నాయకులు, సెలబ్రిటీలు వస్తుంటారు. అలాంటి బరుల్లో రోజుకి ఒక్కో చోట నాలుగైదు కోట్ల రూపాయల పందాలు జరుగుతాయి. మధ్య తరహా బరులు కూడా ఉంటాయి. అక్కడయితే రూ.50 లక్షల నుంచి కోటి వరకు పందాలు జరుగుతాయి. సామాన్యులు కూడా చిన్న చిన్న బరులు నిర్వహిస్తుంటారు. అక్కడ మొత్తం రోజంతా కలిపితే దాదాపు రూ.15 లక్షల పందాలు జరుగుతాయి. మూడు రోజులకు కలిపి పెద్ద బరుల్లో రూ.15 కోట్ల వరకు పందాలు జరుగుతాయి. పెద్ద బరుల దగ్గర ఫ్లడ్ లైట్లు, ఫెన్సింగ్, స్టేజీ ఏర్పాట్లుంటాయి. వాటన్నింటినీ ముందునుంచే సిద్ధం చేస్తారు. వాటి ఏర్పాట్ల కోసం నిర్వాహకులు లక్షల రూపాయలు వెచ్చిస్తారు. పందాలతో పాటు గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారతాయి. మద్యం అమ్మకాలు, మాంసం సహా ఇతర సరుకుల అమ్మకాలు కూడా విస్తృతంగా ఉంటాయి. వాటిని అమ్ముకునేవారు బరి నిర్వాహకులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో బరిలో గంటకు కనీసం నాలుగైదు పందాలు నడుస్తాయి. రోజులో 100 పందాల వరకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పందెంలో గెలిచిన వారు నగదులో కొంత మొత్తం నిర్వాహకులకు అందించాలి. ఒక్కో ప్రాంగణంలో మూడు, నాలుగు బరులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఒక్కో బరి ఏర్పాటుచేసిన వారికి పెద్ద బరులైతే మూడు రోజులకు కనీసం రూ.20 లక్షల పైబడి ఆదాయం వస్తుందని అంచనా.
భీమవరమా.. మజాకా
రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా నుంచి మొదలుపెడితే బాపట్ల జిల్లా వరకు సంక్రాంతి సీజన్‌లో కోడి పందాలు జరుగుతుంటాయి. ప్రధానంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. అన్నింటిలోనూ భీమవరం పందాలకు ఎక్కడలేని క్రేజ్. ప్రతిసారి రాష్ట్రమంతా జరిగే పందాలు ఒక ఎత్తయితే భీమవరంలో జరిగేవి మరో ఎత్తు. దాన్ని ఆంధ్రా లాస్ వెగాస్ అంటారు. ఏటా సంక్రాంతి సమయంలో అక్కడ 200 వరకు పెద్ద బరులు, మరో 500 వరకు ఓ మాదిరి బరులు ఏర్పాటు చేస్తుంటారు. పెద్ద బరుల ద్వారానే నిర్వాహకులకు రూ.40 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఓ అంచనా.
మామూళ్లు మామూలే
ప్రతిసారి కోడిపందాల సీజన్‌కు ముందు కోర్టుల్లో కొంతమంది పిటిషన్లు వేస్తారు. వాటిమీద తీవ్రంగా వాద, ప్రతివాదనలు జరుగుతాయి. కోడిపందాలను నియంత్రించాలని కోర్టులు సూచిస్తాయి. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు కూడా చెబుతారు. కానీ, ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా పందాలు ఆగిన సందర్భమే లేదు. అందుకు మూల కారణం.. అందరికీ అందే మామూళ్లు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరికీ మామూళ్లు ఇచ్చుకోవాలి. ఇవన్నీ బరుల నిర్వాహకులే ఇస్తారు. అసలు బరి ఏర్పాటు చేయాలంటేనే చాలా తతంగం ఉంటుంది. ముందుగా అధికార పార్టీ నాయకుల నుంచి అనుమతి ఉండాలి. ఆ తర్వాత పోలీసుల నుంచి అధికారికంగా మన జోలికి రారనే ధీమా ఉండాలి. లేదంటే ఏర్పాట్లు చేసిన తర్వాత అందరికీ సమాచారం ఇచ్చి, తీరా బరి నడవకపోతే నమ్మకం పోతుంది. మళ్లీ మరుసటి ఏడాది రారు. అందుకే 15 రోజుల ముందుగానే వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. పైకి ఎన్ని చెప్పినా పండగ మూడు రోజులూ తప్పదు కాబట్టి పర్మిషన్ వచ్చేస్తుంది. నిర్వాహకులు తమ జోలికి ఎవరూ రాకుండా ఉండాలంటే.. ఆ పరిధిలోని పోలీసుస్టేషన్ సిబ్బందిని, స్థానిక నాయకులను తప్పనిసరిగా సంతృప్తిపరచాల్సి ఉంటుంది. నిజానికి ఇదంతా బహిరంగ రహస్యమే. కానీ, ఆధారాలు మాత్రం ఎవ్వరూ చూపించలేరు.
అధికార పార్టీ బరులకు ఎదురే లేదు
ఎప్పుడైనా.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు, వాళ్ల అనుచరులు ఏర్పాటుచేసే బరులు నిరాఘాటంగా సాగుతాయి. గ్రామాల్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా బరుల విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తుంటారు. కనీసం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు పోలీసులు చూసీ చూడనట్టుగా ఉండాలనే మౌఖిక ఆదేశాలు వస్తుంటాయి. అదే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్లు ఎవరైనా బరులు ఏర్పాటు చేస్తుంటే మాత్రం.. వాళ్లు చుక్కలు చూడాల్సిందే. కోడిపందాల కేసుల్లో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ గతంలో ఓసారి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశాన్ని అక్కడి సభ్యులంతా కలిసి బహిష్కరించారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ సైతం..
సంప్రదాయ క్రీడగా కోడిపందాలను అనుమతించాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, నాటి వైఎస్సార్సీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా పందెం నిర్వహించుకోడానికి నాడు తాత్కాలికంగా అనుమతులు పొందారు. తెలంగాణ నుంచి కూడా పలువురు నాయకులు భీమవరం వచ్చి కోడిపందాల్లో పాల్గొనడం, విజేతలుగా నిలిచిన కోళ్లను పట్టుకుని ఫొటోలు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.
పందాల్లో పాల్గొనే కోళ్ల రకాలు
కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, పూల, పింగళ, ముంగిస, అబ్రాసు, గేరువా
వారాలను బట్టి దిశలు..
కోడిపుంజులను ఏ దిశలో బరిలోకి వదలాలన్నది కూడా వారాలను బట్టి ఉంటుంది. ఆదివారం, శుక్రవారం-ఉత్తర దిశ. సోమవారం, శనివారం-దక్షిణ దిశ. మంగళవారం-తూర్పు దిశ. బుధవారం, గురువారం-పడమర దిశ.
తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి