స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి(Revanth Reddy) యువతకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
“శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది” అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న యువతీ యువకులందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలి. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మరోసారి మీ అందరికీ జాతీయ యువజన శుభాకాంక్షలు.” అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
“యువతకు మార్గదర్శి…భారతీయ ఆధ్యాత్మిక మహర్షి… స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను” తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.