అగ్రరాజ్యం అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికైన సంగతి తెలిసిందే. జనవరి 20న ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే భారత్ తరఫున కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా కొత్త పరిపాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో జైశంకర్ చర్చల్లో పాల్గొంటారని పేర్కొంది.
కాగా నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)పై రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం విధితమే. దీంతో జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.