కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate)లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అమ్ముడుపోయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లావంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయి సమీక్ష సమావేశంలో ఏం అడుగుతావని నిలదీశారు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. వాగ్వాదం కాస్త పెరగడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకున్నారు. దీంతో సమావేశం ఒక్కసారిగా రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడం గమనార్హం.