తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ(Bhogi Celebrations)ను ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. చిన్నా, పెద్ద, అందరూ వీధుల్లో, ఇళ్ల ముందు భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. భోగి మంటల చుట్టూ తిరుగూత పాడుతూ, డ్యాన్సులు వేశారు. దీంతో వాడవాడలా భోగి మంటలతో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నాయి. ఇక వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
భీమవరం వెంపలో జరిగిన భోగి వేడుకల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని సందడి చేశారు. నెల్లూరు నగరంలోని శివాలయం వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగరిలో మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. సినీ నటుడు మోహన్ బాబు తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ ఆవరణలో భోగి మంటలు వెలిగించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు మంచు విష్ణు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోలు కళాబృందంతో కేబీఆర్ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన భోగి వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.