Monday, January 13, 2025
HomeతెలంగాణManda Jagannadham: మంద జగన్నాథం పార్థివదేహానికి కేటీఆర్ నివాళులు

Manda Jagannadham: మంద జగన్నాథం పార్థివదేహానికి కేటీఆర్ నివాళులు

అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -

మరోవైపు మంద జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. మంద జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అటు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా సంతాపం తెలియజేశారు. మూడు సార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మంద జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన ఆయన.. టీడీపీ ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక బీఆర్ఎస్ అధికనేత కేసీఆర్(KCR) కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మంద జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‎లోని నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథం ఆదివారా రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం చంపాపేట్‌లో జగన్నాథం అంత్యక్రియలు జరగనున్నాయి. 1951 మే 22న జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో జగన్నాథం జన్మించారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996, 1999, 2004లలో టీడీపీ తరపున వరుసగా మూడుసార్లు.. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News