Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు.. విప్లవాత్మక సంస్కరణ

AP: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు.. విప్లవాత్మక సంస్కరణ

వాస్తవిక దృక్పథంతో, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే డిస్కంలు, ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించాయని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. విజయవాడ విద్యుత్ సౌథలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ ..రైతు ఎంత విద్యుత్ ను వినియోగిస్తున్నారు, దానికి ప్రభుత్వం నెలవారీగా ఎంత సబ్సిడీ ఇస్తోంది అనే అంశాలను పూర్తిస్థాయిలో రైతుకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

- Advertisement -

స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న రైతులు నాణ్యమైన విద్యుత్ విషయంలో డిస్కంలను, అధికారులను ప్రశ్నించవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా పొందుతున్న రాయితీలను రైతులు తెలుసుకోవాలన్నదే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రైతులను అనవసర ఆందోళనలకు, అయోమయానికి గురిచేయవద్దన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపట్టిందని..అందులో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పటికే పలుమార్లు వివరించామన్నారు. స్మార్ట్ మీటర్ల స్థానంలో ఐఆర్ మీటర్లు, డీటీ మీటర్లు, ఫీడర్ మీటర్లు ఎందుకు పెట్టకూడదనే ప్రశ్నలకు గతంలోనే సమాధానం చెప్పినట్టు ఆయన తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్ డాక్యుమెంట్ ను న్యాయసమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్లను ఖరారు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయిన విషయం గుర్తుచేశారు. ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ రిపోర్టు లెక్కలు ఏడాదిన్నర క్రిందటివని అయితే తాము చెబుతున్న లెక్కలు తాజా అధికారిక లెక్కలన్నారు. 2023 ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లాలో పెట్టిన ఐఆర్ మీటర్లలో 83.16 శాతం పని చేస్తున్నాయని, వీటి ద్వారా మాత్రమే లైవ్ రీడింగ్ తీసుకుంటున్నామన్నారు.
స్మార్ట్ మీటర్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు:
డీటీఆర్, ఫీడర్, డివిజన్, డిస్కం స్థాయిల్లో ఏ మీటర్ ద్వారా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవచ్చన్నారు. రైతుకు తను ఎంత మేర విద్యు్త్ వినియోగం చేశారనేది తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం నుండి ఎంత సబ్సిడీ అందుతుందో తెలుసుకోవచ్చన్నారు. ఏ మీటర్ ఎందుకు పనిచేయడం లేదో తక్షణమే తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. దీన్ని ఏ విధంగా నియంత్రించాలనేది ట్రాన్స్ కో స్థాయిలో, స్టేట్ లో డిస్టార్ట్ సెంటర్ స్థాయిలో ఎప్పటికప్పుడు విద్యుత్ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చనని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. స్మార్ట్ మీటర్ల వినియోగం వల్ల అందుబాటులో ఉన్న విద్యుత్ ఎంతుందో తెలుస్తుంది. తద్వారా మార్కెట్ లో మనం విద్యుత్ ను అమ్మాలన్నా, కొనాలన్నా మార్గం సులువవుతుందన్నారు. అదే విధంగా స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి 15 నిమిషాలకోసారి డేటా వస్తుందని, మనం ఎక్కడి నుండైనా మీటర్ ను ఆఫ్, ఆన్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మీటర్లు ఎంత విద్యుత్ ను వినియోగిస్తున్నాయి? ఏ రకమైన లోడ్ తీసుకుంటున్నాయి? ఎప్పటికప్పుడు చూసుకొని ట్రాన్స్ కో గానీ, స్టేట్ లో డిస్టార్ట్ సెంటర్ గానీ విద్యుత్ కొనుగోలును బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నారు. విద్యుత్ ను ఆదా చేసుకునేందుకు ఇదొక అవకాశంగా భావించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడమనేది ఒక విప్లవాత్మక సంస్కరణ అన్నారు. అలైడ్ మెటీరియల్ ఆర్థికంగా భారమైనా దాదాపు రూ.4వేల కోట్లను వెచ్చించి మీటర్లతో ఏర్పాటు చేస్తుందన్నారు. రకరకాల టెక్నాలజీలు, పద్ధతులు వాడటం ద్వారానే సంస్కరణలు వస్తాయని, వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా 2025 లోగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కార్యక్రమం పూర్తవుతుందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఏడాది లోగా అన్ని కనెక్షన్లు ఇస్తామన్నారు. మొత్తం 18 లక్షల మీటర్లు బిగించడం జరుగుతుందన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అన్నారు. స్మార్ట్ మీటర్ల గురించి రైతులకు ఎలాంటి అనుమానాలూ లేవని..రైతుల నుంచి ఆమోద పత్రాలను తీసుకున్నామన్నారు. 16 లక్షల 55 వేల 988 మంది రైతులు స్మార్ట్ మీటర్లకు మద్దతు తెలిపారని..స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వమే వ్యయం భరిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News