హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై(kaushik Reddy) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో తనపై దురుసుగా ప్రవర్తించారని.. దుర్భాషలాడారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని తెలిపారు. వెంటనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించారంటూ సంజయ్ పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక కలెక్టరేట్ లో బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం సృష్టించి, సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదైంది.