పాత ఢిల్లీ నగరంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాందిని చౌక్ ఎలక్ట్రానిక్స్ హోల్ సేల్ మార్కెట్లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పైకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికి మంటలు ఎగసిపడ్డాయి. తొలుత 18 ఫైరింజన్లు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాయి. సాధ్యపడకపోవడంతో మరిన్ని ఫైరింజన్లు వచ్చాయి. దాదాపు 40 ఫైరింజన్లతో ఘటనా ప్రాంతంలో మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. మూడు అంతస్తుల వరకు భవనం పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తినష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భగీరథ్ పాలెస్ లోని 50 షాపులు ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు తెలిపారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా.. ఢిల్లీలో పురాతన భవనాలు ఎక్కువగా ఉన్న చాందిని చౌక్ వంటి ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచుతామని అధికారులు ప్రకటించారు.