నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. రేపు(మంగళవారం) మాచర్లకి తాను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నానని తెలిపారు. దమ్ముంటే తనను అడ్డుకుని దాడి చేయండని సవాల్ విసిరారు.
మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తాను, బోండా ఉమా మాచర్ల వెళ్ళామని చెప్పారు. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరులు.. తమను చంపిన వారికి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ ఆఫర్ ఇచ్చారని.. తురకా కిషోర్ అనే వ్యక్తి తమను చంపేందుకు ముందుకు వచ్చాడన్నారు. తమపై దాడిలో పాల్గొన్నది తురకా కిషోర్ అయితే.. దాడి చేయించింది పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. ఈ కేసులో వారిని వదిలే ప్రసక్తే లేదని.. వారికి చట్టప్రకారంగా శిక్ష పడే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.