ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల(Sabarimala)లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి(Makara Jyothi) రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి కనిపించింది. జ్యోతిని తిలకించి లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి.
అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుంచి శబరిమలకు లక్షన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.