మోహన్ బాబు తిరుపతి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోహన్ బాబు, మంచు విష్టు యూనివర్సిటీలో ఉండగా.. ఆయన రెండో కొడుకు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితి మరింత అదుపు తప్పాయి. యూనివర్సిటీ ఆవరణలో తన తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులర్పించేందుకు వచ్చానని మనోజ్ చెప్పినా.. సెక్యూరిటీ ఆయనను లోపలికి అనుమతించ లేదు.
దీంతో మనోజ్ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వెంటనే తనను లోపలికి పంపించాలని డిమాండ్ చేశాడు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు వివాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. మంచు కుటుంబం మధ్య గొడవల కారణంగానే అతడిని యూనివర్సిటీలోకి అనుమతించలేదని.. సెక్యూరిటీ సిబ్బంది చెపుతున్నారు.
ఇదిలా ఉంటే.. అంతక ముందు.. మనోజ్ ఆయన భార్య మౌనికలు.. రంగంపేటకు చేరుకుని.. మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అనంతరం అక్కడే జల్లికట్టు పోటీలను తిలకించారు. ఆ తర్వాత యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మనోజ్ రాకపై ముందుగా సమాచారం అందుకున్న యూనివర్సిటీ యాజమాన్యం గేట్లు మూసి, ఎవ్వరిని లోనికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.