కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ కాలేదని.. ఆయన తరపు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. తమ లీగల్ టీమ్ ఒపీనియన్ ప్రకారం కేసును ఉపసంహరించుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులో అయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఏసీబీ FIRలో పేర్కొన్నవి ప్రొసీజర్‌లోని ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అన్నారు. ఈ కేసులో సెక్షన్ 13.1ఏ సీపీ యాక్ట్ వర్తించదని కోర్టుకు తెలిపామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 9 నగరాల్లోనే ఫార్ములా ఈ-రేస్ జరుగుతోందని న్యాయవాది, BRS జనరల్ సెక్రటరీ సోమా భరత్ అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు దీనిని రప్పించారని తెలిపారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచేందుకే దీనిని నిర్వహించినట్లు చెప్పారు. KTRపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని KTR నమ్మకంగా చెబుతున్నారని తెలిపారు. కేసులో అక్రమాలకు ఆధారాలు లేవని కోర్టు విశ్వసించిందన్నారు.
క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడం వేరు, ఉపసంహరించుకోవడం వేరు అని అన్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చెప్పినందుకే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.
విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ చెప్పారని సోమా భరత్ తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లేతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు.