ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా గురువారం ఈడీ ముందు మాజీమంత్రి కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ ను ఈడీ విచారించనుంది. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణకు KTR ఒక్కరే హాజరు అవుతారా.. లేక న్యాయవాదితో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించింది ఈడీ. వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించనుంది.
ఈడీ అధికారులు కేటీఆర్‌పై సాయంత్రం దాకా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. ఫార్ములా-ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందని, ఆర్బీఐ మార్గదర్శకాల్ని బేఖాతరు చేసి నిధుల మళ్లింపు చేశారన్నది ఈడీ అభియోగం మోపినట్లు తెలుస్తోంది.
మరోవైపు గురువారం ఈడీ విచారణ పూర్తయిన వెంటనే.. ఏసీబీ మళ్లీ సీన్లోకి రాబోతోంది. కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 9వ తేదీ తొలిసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఎనభైదాకా ప్రశ్నలడిగారని.. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని.. అప్పుడు కేటీఆర్ విమర్శించారు. దీంతో మళ్లీ ఇంటరాగేట్ చేసేందుకు రెడీ ఔతోంది ఏసీబీ. దీంతో ఈ కేసు ఎటువైపు వెళ్తుందో అని ఆసక్తి నెలకుంది.