మంచు మనోజ్ పై అతని తండ్రి.. మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ కోర్టు ధిక్కరణ చేశారని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం.. మంచు మనోజ్ సంక్రాంతి పండక్కి నారావారి పల్లెలో ఉన్న మేనత్త మేడసాని.. విజయమ్మగారి ఇంటికి వెళ్తానని కబురు చేశాడని.. అందుకు ఆమె ఒప్పుకోలేదని తెలిపారు.
అయితే తండ్రి, అన్నతో గొడవలు పడుతున్నాడు కాబట్టి.. ఇంటికి రావద్దని మేనత్త తెలిపిందంట. అయినా వినకుండా ఏదో దురుద్దేశంతో నారావారి పల్లెకు వచ్చాడని.. లోకేష్ ను కలిసి ఒక్క నిమిషం మాట్లాడి వెళ్లిపోయాడని లేఖలో వివరించారు. అనంతరం నారా రోహిత్ గారితో సినిమా తీస్తున్న కారణంగా ఆయనతో మాట్లాడి వచ్చేశాడు. తిరిగి వస్తున్న క్రమంలో డాక్టర్ మోహన్ బాబు గారి యూనివర్సిటీ గేటు దగ్గర 200 మందితో లోనికి రావాలని ప్రయత్నించాడు.
కోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణంలోకి వెళ్లకూడదని పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. తర్వాత డైరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలకు ప్రవేశించాడు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుంది.. కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పోలీసులను, కోర్టును కోరుతున్నా అని మోహన్ బాబు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి మంచు కుటుంబ వ్యవహారం.. రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.