బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆయనకు ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో రెండు లోతైన తీవ్ర గాయాలని పేర్కొన్నారు. మెడ, వెన్నెముకపై కత్తి పోట్లు లోతుగా దిగాయన్నారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స పూర్తి అయిందని.. ప్రాణాపాయం ఏం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు సైఫ్ టీమ్ అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఈ సమయంలో మీడియా, అభిమానులు ఓపికగా ఉండాలని అభ్యర్థించారు. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడించారు.