ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi elections) నేపథ్యంలో ప్రజల హామీలకు సంబంధించిన పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్, తదితర నేతలు పాల్గొన్నారు. రెండు ఎన్నికల హామీలను ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ తోపాటు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఆరు గ్యారంటీలను నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని.. రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పార్టనర్‌ను తెలంగాణలో ఓడించానని.. అసలు పార్టనర్‌ను కూడా ఢిల్లీలో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి రావాలంటే ఇక్కడి కాలుష్యానికి ప్రజలు భయపడుతున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.