బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును ఛేదించే బాధ్యతను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్(Daya Naik)కి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో సైఫ్ ఇంటిని ఆయన పరిశీలించారు. కాగా దయా నాయక్ ఇప్పటివరకు 80 ఎన్‌కౌంటర్లు చేశారు. ముంబై మాఫియాకు చుక్కలు చూపించారు.
మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని.. సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లు తెలిపారు. అలాగే ఎడమ చేయితో పాటు మెడపైనా గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని లీలావతి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటితో సహా దగ్గర్లోని అన్ని సీసీటీవీ దృశ్యాలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. దాడి జరగడానికి ముందు రోజే మెట్లు ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగులు ప్రవేశించిన సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తెల్లవారుజామున దొంగతనం కోసం ముందుగా సైఫ్ కొడుకు జెహ్ రూంలోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. దీంతో జెహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. దీంతో దుండగులు సైఫ్ మీద కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.