ఏపీ అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర విజన్-2047 తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. సచివాలయంలో స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ తలసరి ఆదాయం రూ.2,37, 951గా ఉందని తెలిపారు. విజన్ డాక్యుమెంట్‌లో 16 లక్షల మంది భాగస్వాయులయ్యారని.. 2047నాటికి తలసరి ఆదాయం రూ. 58,14,916 అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశం కంటే రాష్ట్రమే ముందుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా.. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోందన్నారు.
రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు(Polavaram project) జీవనాడి లాంటిదని చెప్పారు. గత ప్రభుత్వంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారన్నారు. 2014-19 సమయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచి రాష్ట్రంలో వెలుగులు నింపినట్లు.. అయినా తాను ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఐటీపై తాను మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారని చెప్పారు. అలాంటి ఐటీ రంగం ప్రస్తుతం చాలా మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందన్నారు. వైసీపీ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని వాపోయారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.