సంక్రాంతి సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు వెళ్తుంటారు. దీనికోసం ఆర్టీసీ ప్రతి సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా APSRTC ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించనుంది ఆర్టీసీ.
ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు నడిపే బస్సులో ప్రయాణీకులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించారు. అలాగే రానూపోనూ టికెట్లు ఒకేసారి ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా కల్పించారు. ఇక ఈ సంక్రాంతికి APSRTC ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి రికార్డు సాధించింది. దీంతో సంస్థను లాభాల్లోకి వెళ్లింది.
ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకూ ఏపీఎస్ఆర్టీసీలో సంక్రాంతికి 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో దాదాపు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది. సుమారుగా రూ.12.5 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఆశించింది.
అయితే తిరుగు ప్రయాణాలు ఇంకా పూర్తి కాలేదు.. ఈ క్రమంలో మరింత ఆదాయం వస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. గత సంవత్సరం రాను పోను కలిపి రూ.12 కోట్లు ఆదాయం ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ. గత సంవత్సరం ప్రయాణించిన 4.3 లక్షల మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేశారు. ఈ లెక్కన చూస్తే ఈ సంవత్సరం ఆ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.