ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు జిల్లాలోని గంగాసాగరం వద్ద టిప్పర్‌ను తప్పించబోయి బోల్తాకొట్టింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు వివరాలపై ఆరాతీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు.