సీఎం చంద్రబాబు వైఖరి ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’లా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమల్లో విఫలమైందంటూ ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు .
” ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.
చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసం ? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. బాబు గారి పనితనం శూన్యం.
ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి. నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యం” అని షర్మిల పేర్కొన్నారు.