ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో టీటీడీ సిబ్బంది తీరుపై భక్తులు ఆందోళనకు దిగారు. వరాహస్వామి ఆలయంలో వీఐపీల దర్శనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టి.. సిఫార్సు భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తులందరిని ఒకేలా చూడకుండా కేవలం కొందరికే కొమ్ము కాస్తున్నారని వాపోయారు.
దేవుడి దర్శనం కోసం ఎన్నో వ్యయప్రయాసాలతో తిరుమల వస్తే వీఐపీల కోసం తమను గంటల కొద్దీ క్యూలైన్లలో ఉంచడం ఏంటని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని.. వీఐపీ కల్చర్ మానుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా కానీ సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నారు.