పార్కిన్సన్స్ వ్యాధి, దీని పేరు చెబితేనే చాలా కుటుంబాలు భయంతో వణికిపోతాయి. ఎందుకంటే, అప్పటికే తమ కుటుంబాల్లో ఎవరో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేతులు వణుకుతూ, అడుగులు సరిగా పడక ఇబ్బంది పడుతున్నవారిని చూస్తూనే ఉంటారు. సాధారణంగా కాస్త పెద్ద వయసులో వచ్చే ఈ సమస్య, ఇటీవల చిన్న వయసులోనూ కొందరికి వస్తోంది.
మొదట్లో చిన్నగా వేళ్లు
ఈ వ్యాధి వచ్చినవారికి మొదట్లో వేళ్లు వాటంతట అవే కొంత కదులుతుంటాయి. తర్వాత క్రమంగా చెయ్యి మొత్తం వణుకుతూ ఉంటుంది. చేత్తో కనీసం పెన్ను పట్టుకుని సరిగా రాయలేరు. గ్లాసు చేత్తో పట్టుకుని మంచినీళ్లు గానీ, టీ కాఫీలు గానీ తాగలేరు. అన్నం తినడం కూడా చాలా కష్టం అవుతుంది. అన్నింటికీ పక్కన ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. పోనీ ఇదేదో కొన్నాళ్లు ఉండి మందులు వాడితేనే, మరేదైనా చికిత్స తీసుకుంటేనో తగ్గిపోతుందని అనుకుంటే ఇన్నాళ్లుగా అలాంటి ఆశ దాదాపు లేదు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లాంటి శస్త్రచికిత్సలు ఉన్నా వాటితో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయోనన్న భయం, అసలే మెదడుకు శస్త్రచికిత్స కావడంతో చాలామంది భయపడి, వయసురీత్యా కుదరదని భావించి ఆగిపోతున్నారు. వారిలో కొందరు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఆయుర్వేద చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నా, ఎంతవరకు ఉంటుందనేది మాత్రం అనుమానమే. దాంతో బతికున్నన్నాళ్లూ బాధలు భరించాల్సిందేనన్న కుంగుబాటు కూడా పార్కిన్సన్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువ అవుతోంది. అయితే, వైద్యరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉంది. దానివల్ల ప్రతి సమస్యకూ ఓ సమర్థవంతమైన పరిష్కారం లభిండానికి అవకాశాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి.
ఎంఆర్జీఎఫ్యూఎస్
పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు అందరికీ ఇప్పుడు వస్తున్న సరికొత్త చికిత్సా పద్ధతి అయిన ఎంఆర్జీఎఫ్యూఎస్ ఒక అద్భుతమైన పరిష్కారంగా కనపడుతోంది. మాగ్నెటిక్ రిజొనెన్స్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రా సౌండ్ – ఎంఆర్జీఎఫ్యూఎస్ అనే ఈ యంత్రం.. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల వచ్చే వణుకును వెంటనే తగ్గిస్తుంది. ఏదో ఒక మంత్రం వేసినట్లుగా అప్పటివరకు తీవ్రంగా ఉన్న వణుకు కాస్తా.. ఈ యంత్రం మీద చికిత్స తీసుకున్న తర్వాత ఐదారు నిమిషాల్లోనే పూర్తిగా ఆగిపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యి, ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆస్పత్రులలో అందుబాటులోకి వచ్చింది.
ప్రధాన కారణాలు.
- ఒత్తిడితో కూడిన జీవనశైలి
- వయస్సు పై బడటం
- వంశపారంపర్యం
- మెదడుకు దెబ్బ తగలడం
- మెదడు ఇన్ఫెక్షన్లకు గురికావడం
- ప్రమాదవశాత్తు తలకు గాయాలు కావడం
- ప్రమాదాల్లో మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం
- మద్యపానం లాంటి దురలవాట్లు
కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే చాలామంది తమ జీవన నాణ్యత గురించే ఇబ్బంది పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికీ ఎవరో ఒకరిమీద ఆధారపడాల్సి ఉంటుందని, చివరకు మూత్ర విసర్జన సమయంలో కూడా ఇబ్బంది అవుతుందని మానసికంగా నలిగిపోతుంటారు. ఏ వయసులో ఉన్నా కూడా పార్కిన్సన్స్ వ్యాధి వల్ల వచ్చే వణుకును పూర్తిగా తగ్గించడానికి ఎంఆర్జీఎఫ్యూఎస్ యంత్రాన్ని తాజాగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే మెదడు సంబంధిత సమస్యలకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందిస్తున్న ఈ ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు వైద్యపరంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే ఎంఆర్జీఎఫ్యూఎస్ యంత్రాన్ని తెప్పించి, దాంతో పార్కిన్సన్స్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. మందులకు నయం కాకుండా, శస్త్రచికిత్స చేయించుకునే పరిస్థితి లేనప్పుడు ఇది ఒక అద్భుతమైన పరిష్కారంగా కనిపిస్తోంది. ఇతరత్రా వ్యాధులు ఏమీ లేకుండా.. కేవలం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న చాలామందికి ఇది కచ్చితంగా సరిపోతుంది. పైగా.. అత్యంత కచ్చితత్వంతో, సమస్య ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే చికిత్స చేసే విధానం ఇందులో ఉండడంతో రోగి భద్రత గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. సాంకేతిక పరిజ్ఞానం వైద్యచికిత్సల తీరుతెన్నులను గణనీయంగా మార్చేసింది. దీనివల్ల వైద్య నిపుణుల సామర్థ్యానికి ఈ యంత్రాల కచ్చితత్వం తోడవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పార్కిన్సన్స్ బాధితులకు ఈ అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ఊరట కలుగుతుంది. రోగలు సంరక్షణలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇందులో ఎక్కడా కోతలు పెట్టాల్సిన అవసరం లేదు. మత్తుమందు ఇవ్వక్కర్లేదు, అలాగే చివరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఓపీ పద్ధతిలోనే వచ్చి ఈ చికిత్స తీసుకుని, వణుకులు తగ్గించుకుని వెళ్లిపోవచ్చు.
పార్కిన్సన్స్ వచ్చినట్లు గుర్తించడం ఎలా?
పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినట్లు దాని లక్షణాలను బట్టి సులభంగా గుర్తించవచ్చు. బాధితులు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయినా,చుట్టుపక్కల ఉన్నవాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ లక్షణాలు ఇలా..
- వణుకు
- మాట తడబడడం
- మింగడంలో ఇబ్బంది
- వాసన కోల్పోవడం
- నడక తగ్గిపోవడం
- ఒకవైపు చెయ్యి వణకడం
- కదలికలు నెమ్మదించడం
- కండరాలు బిగుసుకుపోవడం
- ఒకరి సహాయం లేకుండా నడవలేకపోవడం
- చేతులు, కాళ్లు బిగుసుకుఓయి నడవడం కష్టం కావడం
ప్రపంచ పార్కిన్సన్స్ రాజధాని భారత్?
మన దేశంలోని ప్రతి లక్ష మంది ప్రజల్లో 15 నుంచి 43 మంది పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కంటే మన దేశంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. గతంలో ఇది 50-60 ఏళ్లు దాటినవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు దాదాపు మన దేశంలోని మొత్తం పార్కిన్సన్స్ రోగుల్లో 40-45% మందికి 22 నుంచి 49 సంవత్సరాల లోపే ఈ వ్యాధి లక్షణాలు మొదలవుతున్నాయి.
పార్కిన్సన్స్ వ్యాధి అనేది.. క్రమంగా పెరుగుతూ ఉండే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. ముఖ్యమైన మెదడులోని డోపమైన్ లోపం మన శరీరంలోని కదలికలను ప్రభావితం చేస్తుంది. ఇన్నాళ్లుగా దీన్ని కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కానీ, ఇటీవలి కాలంలో యువత కూడా దీని బారిన పడుతున్నారు. నిజానికి దీని లక్షణాలు కొద్దికొద్దిగా అయినా 50 సంవత్సరాల లోపే కనిపిస్తాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోకపోవడమో.. లేదా వేడిచేయడం వల్ల వచ్చిందని అనుకోవడమో జరుగుతుంది. భారతదేశంలో ఈ వ్యాధి ప్రారంభమయ్యే సగటు వయసు 51.03 11.32 సంవత్సరాలు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది ఒక దశాబ్దం తక్కువ! ప్రపంచవ్యాప్తంగా చూసినా, మన దేశంలో చూసుకున్నా కూడా.. మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
మెదడు వయసు పెరిగేకొద్దీ
శరీరంలో మెదడు చాలా కీలకం. ఇందులో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర అనారోగ్యం వస్తుంది. మన మెదడు వయసు పెరిగే కొద్దీ దెబ్బతింటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలే పార్కిన్సన్స్ వ్యాధులకు దారితీస్తాయి. పార్కిన్సన్ అనేది మెదడుకు సంబంధించిన సమస్య. మెదడులో మనిషిని నడిపేందుకు సహాయం చేసే డొపమైన్ అనే హార్మోన్ తక్కువ మోతాదులో విడుదల అయినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా డొపమైన్, ఎపినెప్రిన్ లాంటి హార్మోన్లు నాడీ కణాల మధ్య సమాచారం ప్రసారం కావటానికి తోడ్పడతాయి. సామాన్యంగా ఈ సమస్య పెద్దవయస్సు (50-60 ఏళ్లు) గలవారిలో వస్తుంది. పార్కిన్సన్స్ సమస్య మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్ బాధితులుంటే వంశపారంపర్యంగా ఇతరులకు కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
మన చుట్టూ ఉన్న వాతావరణం ఇప్పటికే కలుషితం అయిపోయింది. దాంతోపాటు.. మనం తింటున్న ఆహారం కూడా విపరీతంగా క్రిమిసంహారక మందులను ఉపయోగించి పండిస్తున్నారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల, కాలుష్యానికి గురికావడం వల్ల కూడా మెదడులో మెదడులో డోపమైన్ రసాయనం ఉత్పత్తి చేసే నరాలు క్రమంగా దెబ్బతింటాయి. ఇలాంటి కారణాల వల్లే మన దేశంలో 30 ఏళ్లలోపువారికి కూడా పార్కిన్సన్స్ వ్యాధి వస్తోంది. సాధారణంగా ఒకవైపు చెయ్యి, కాళ్లు తొలుత దీనివల్ల ప్రభావితం అవుతాయి. తర్వాత కొంత కాలానికి రెండువైపులా చేతులు, కాళ్లు వణుకుతుంటాయి, కాళ్ల అడుగులు సరిగా పడవు.
పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణ
రోగి గత చరిత్ర, వాళ్ల కుటుంబ చరిత్ర, 18 ఎఫ్ ఫ్లురోడోపా, పెట్ టెస్ట్, శారీరక పరీక్షలు చేసిన తర్వాత ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. సీటీ స్కాన్ ఎంఆర్ఐ లాంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, సాధారణ ఒత్తిడి హైడ్రోసెఫాలస్ లేదా వాస్కులర్ పార్కిన్సోనిజం లాంటి మెదడు సంబంధ సమస్యలు ఉన్నాయా అన్న విషయాన్ని గుర్తించి, తద్వారా ఈ సమస్యను నిర్ధారించవచ్చు.
నివారణ చర్యలు
ఏ వ్యాధి అయినా రాకముందే కొంత జాగ్రత్త పడడం మంచిది. వచ్చిన తర్వాత చికిత్స అవకాశాలు ఎటూ చూసుకుంటాం. ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది, లేదా వ్యాధి రాకుండా కూడా నివారించవచ్చు.
పోషకాలు ఎక్కువగా ఉండే (యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్) ఆహారాలు తీసుకోవడం
వాకింగ్, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వర్కౌట్స్ చేయడం
తగినంత సేపు బాగా నిద్రపోవడం
అనవసరమైన ఆలోచనలు మానుకోవడం, ఒత్తిడిలో ఉంటే మెదడుకు హాని కలుగుతుంది కాబట్టి యోగా, ధ్యానం లాంటివి చేయడం, వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మ్‌ట్, సీటు బెల్టు ధరించడం. పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా ఉండడం, కాచిన వంట నూనెలను పదే పదే మళ్లీ వాడకూడదు. పసుపులో యాంటీసెప్టిక్, కర్కుమిన్ అనే పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వంటకాల్లో పసుపు వాడడం మంచిది. శారీరక వ్యాయామం, నడవడం, ఫిజియోథెరపీ వల్ల కీళ్లు బాగుంటాయి. దానివల్ల వ్యాధితో కలిగే దుష్ప్రభావాల నుంచి కొంత వరకు కోలుకునే అవకాశం ఉంటుంది.
ఈ చికిత్సతో వణుకును తగ్గిస్తాం
మాగ్నెటిక్ రిజొనెన్స్ గైడెడ్, ఫోకస్డ్ అల్ట్రా సౌండ్.. ఎంఆర్జీఫస్ అనే ఈ యంత్రాన్ని కిమ్స్ ఆస్పత్రిలో ప్రవేశపెట్టినట్లు సగర్వంగా ప్రకటిస్తున్నాం. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల వచ్చే వణుకును పూర్తిగా తగ్గించడంలో ఇది ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీ. ఇది చిన్న కోత కూడా లేకుండానే మెదడులో ఉన్న సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ అత్యాధునిక టెక్నాలజీ చికిత్సలో అత్యంత కచ్చితత్వం సాధిస్తుంది. తద్వారా రోగులకు అత్యంత సురక్షితమైన, అత్యద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – కిమ్స్ ఆస్పత్రి రోగులకు వీలైనంత తక్కువ ధరలో, అత్యంత నాణ్యమైన చికిత్సలు అందించే విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మేం తెలుగురాష్ట్రాల్లోనే తొలిసారిగా ఈ యంత్రాన్ని తీసుకొచ్చాం. ఇది అన్నిరకాల వణుకు సమస్యలను.. ముఖ్యంగా పార్కిన్సన్స్ వ్యాధి వల్ల వచ్చే వణుకును పూర్తిగా తగ్గిస్తుంది. మా ఆస్పత్రిలోని నిపుణులైన సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఈ మిషన్ మీద చేసే చికిత్స ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది. బయటకు వచ్చిన తర్వాత వెంటనే మార్పు గమనించుకోవచ్చు. అంటే, చేతుల్లో ఉన్న వణుకు వెంటనే ఆగిపోతుంది. సాధారణంగా ఒకవైపు వణుకుకు ఒకసారి చికిత్స చేస్తారు. రెండువైపులా ఉంటే కొంతకాలం ఆగిన తర్వాత చేస్తారు. ఏది ఏమైనా.. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో ఇది ఒక కొత్త పెను సంచలనం అని మాత్రం సగర్వంగా చెప్పగలను.
– డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, సీనియర్ కన్సల్టెంట్
కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్, ఛైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్ ఆస్పత్రి
పార్కిన్సన్స్ బాధితులకు కొత్త జీవితం అందిస్తున్నాం
కృష్ణ మహదేవ్ ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన చేతులు ఆయన స్వాధీనంలో ఉండేవి కావు. ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలే. ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధి కాస్త పెద్ద వయసులో వస్తుంది. కానీ అరుదుగా ఇలా చిన్నవాళ్లకు కూడా రావచ్చు. కృష్ణకు మేం ఆస్పత్రిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎంఆర్జీఎఫ్యూఎస్ చికిత్స అందించాం. ఆ తర్వాత అతడికి చక్కగా నయమైంది. ఇప్పుడు కాగితం మీద తన పేరు తాను రాసుకున్నాడు. అది చూసి ఎంతగానో సంతోషించాడు. మళ్లీ పిల్లలకు పాఠాలు చెప్పగలనని, బోర్డుమీద లెక్కలు రాయగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. కిమ్స్ ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రోగులకు సంపూర్ణ స్వస్థత చేకూర్చే ప్రయ త్నం చేస్తున్నాం. ఇన్నాళ్లూ పార్కిన్సన్స్ వ్యాధికి సరైన చికిత్స లేదు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉన్నా, అందరూ దానికి సుముఖత చూపేవారు కారు. దాంతో ఈ వ్యాధి బాగా ఇ బ్బంది పెట్టేది. ఇప్పుడు వచ్చిన ఈ అత్యాధునిక చికిత్సతో పార్కిన్సన్స్ రోగులకు ఒక సరికొత్త జీవితం లభిస్తుందని కచ్చితంగా చెప్పగలం.
- డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, న్యూరోసర్జరీ విభాగాధిపతి, కిమ్స్ ఆస్పత్రి
తక్షణమే ఫలితం..
మెరుగుపడే జీవన నాణ్యత
ఎంఆర్జీఎఫ్యూఎస్ అనేది చాలా సురక్షితమైన చికిత్స. ముఖ్యంగా పార్కిన్సన్స్ బాధితుల్లో చాలామంది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి భయపడతారు. అలాంటివారికి ఇది చాలా మంచి అవకాశం. ఇందులో ఎంఆర్ఐలో ఉండే కచ్చితత్వం, అల్ట్రాసౌండ్ విధానంలో ఉండే చికిత్స పద్ధతి రెండూ కలిసి ఉంటాయి. దీనివల్ల తక్షణమే ఫలితం కనిపిస్తుంది. ఈ చికిత్స చేసిన తర్వాత రోగి జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. అంతకుముందు వాళ్లు పడిన ఇబ్బందులేమీ ఇకపై ఉండవు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది ముఖ్యంగా ఎసెన్షియల్ ట్రెమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి వాటితో బాధపడుతున్న అనేకమంది రోగులకు ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు.
- డాక్టర్ ఎం.జయశ్రీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
కిమ్స్ ఆస్పత్రి
- చిన్న కోత కూడా అక్కర్లేకుండా ఉపశమనం
- ఎంఆర్జీఎఫ్యూఎస్ చికిత్సలో ఉండే ఒక మంచి లక్షణం.. ఇందులో అస్సలు చిన్న కోత కూడా పెట్టాల్సిన అవసరం ఉండనే ఉండదు. పైగా ఇది అత్యంత కచ్చితత్వంతో చికిత్స అందిస్తుంది. ఇది చేయించుకున్న తర్వాత రోగులకు అప్పటివరకు ఉన్న సమస్యలు చేత్తో తీసిపారేసినట్లు పోతాయి. ఇందులో కోత పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో.. మత్తు కూడా ఇవ్వక్కర్లేదు. అందువల్ల మత్తు వల్ల వచ్చే దుష్ప్రభావాలు అస్సలు ఉండనే ఉండవు. చికిత్స అయిన తర్వాత రోగి ఎంచక్కా ఒకటి రెండు గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు.
- డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాదా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఆస్పత్రి
జీవితం మీద మళ్లీ నమ్మకం కుదిరింది
నేను లెక్కల టీచర్‌గా పనిచేసేవాడిని. కానీ, కొవిడ్ తర్వాత కొంత కాలానికి నాకు చేతులు వణకడం మొదలైంది. అది క్రమంగా బాగా ఎక్కువైపోయింది. నా చేతుల మీద నాకు పట్టు ఉండేది కాదు. చేత్తో బోర్డు మీద రాయగలిగేవాడిని కాను. గ్లాసు పట్టుకుని నీళ్లు తాగడం, చేత్తో ఆహారం తీసుకోవడం అన్నీ బాగా కష్టం అయిపోయేవి. అప్పుడే నాకు కిమ్స్ ఆస్పత్రి గురించి, డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి గురించి తెలిసింది. ఆయన ఇక్కడ ఇస్తున్న ఎంఆర్జీఎఫ్యూఎస్ గురించి కూడా తెలుసుకున్నాను. ఇక్కడకు వచ్చాక నాకు చికిత్స చేశారు. ఇప్పుడు మీరే చూడండి.. అస్సలు నా చేతిలో వణుకు అన్నది లేదు. నేను కాగితం మీద ఎంచక్కా రాయగలుగుతున్నాను. నా జీవితం మీద మళ్లీ నాకు ఒక నమ్మకం కుదిరింది. అదంతా కిమ్స్ ఆస్పత్రి పుణ్యమే. - దండే కృష్ణ మహదేవ్, 27 సంవత్సరాల టీచర్, మహారాష్ట్ర
ఆయన సంతకం చేయడం చూసి మురిసిపోయాం
విజయవాడకు చెందిన మా భర్త బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఆయన వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. రిటైర్ అయిన తర్వాత కొద్ది కాలం నుంచే ఆయనకు ఈ వ్యాధి మొదలైంది. అప్పటినుంచి.. అంటే సుమారు 15 ఏళ్ల నుంచి కూడా ఆయన కనీసం తన పేరు కూడా సరిగా రాయలేకపోతున్నారు. మంచినీళ్లు కూడా ఆయన సొంతంగా తాగలేకపోతున్నారు. మనమే దగ్గరుండి తాగించాలి. ఆయన తాగే ప్రయత్నం చేస్తే నీళ్లన్నీ కింద, లేదా ఆయన బట్టల మీద ఒలికిపోతాయి. అన్నం కూడా తినలేకపోయేవారు. దాంతో మేం ఇన్నాళ్లూ చాలా బాధపడ్డాం. ఈమధ్యనే మేం విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కిమ్స్ ఆస్పత్రిలో ఈ సమస్యకు చికిత్స ఉందని తెలుసుకుని వెంటనే ఇక్కడకు చేరుకున్నాం. చికిత్స పూర్తయ్యి బయటకు రాగానే ముందుగా ఆయనతో కాగితం మీద సంతకం చేయించారు. అది చూసి మేమంతా ఎంతో ఆనందపడ్డాం. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఆయన తన చేత్తో తన పేరు రాసుకోగలిగారు. అలాగే మంచినీళ్లు కూడా తనంతట తానే గ్లాసులో పట్టుకుని, తానే గ్లాసు చేత్తో పట్టుకుని తాగారు. ఇప్పుడు కుడివైపు అంతా వణుకు ఆగిపోయింది. ఎడమవైపు కూడా ఉంది గానీ, దానికి మరో ఆరు నెలల తర్వాత చేస్తామంటున్నారు. ఇప్పుడు వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. మా కుటుంబం మొత్తం ఆయన పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాళ్లం. ఇప్పుడు ఆయన కోలుకున్న తీరుచూసి ఎంతగానో సంతోషిస్తున్నాం. మా పిల్లలు కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు.
- చికిత్స చేయించుకున్న వ్యక్తి భార్య, విజయవాడ
మా నాన్నగారు ఉంటే ఈ చికిత్స చేయించేవాడిని
మా నాన్నగారు దాదాపు 14 సంవత్సరాల పాటు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడి, తర్వాత మరణించారు. ఆయన బీఎస్ఎన్ఎల్లో పనిచేసేవారు. సర్వీసు దాదాపు చివరిదశకు వచ్చిందనగా ఆయనకు ఆ సమస్య మొదలైంది. మొదట్లో కొంతమంది న్యూరాలజిస్టులకు చూపించాం. వాళ్లేవో మందులు ఇచ్చారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. తర్వాత ఎవరో చెప్పారని కర్ణాటకలో ఆయుర్వేదం మందు ఇస్తున్నారంటే అక్కడకు కూడా తీసుకెళ్లాం. అది వేసుకున్న కూడా ఆయనకు వచ్చిన సమస్య తగ్గలేదు. అప్పటికి మొదట్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి తెలియదు. తెలిసేసరికే ఆయనకు 70 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆ వయసులో చేయడం అంత మంచిది కాదని కొందరు చెప్పడంతో ఆగిపోయాం. నిజానికి ఎంఆర్జీఎఫ్యూఎస్ లాంటి చికిత్సలు అప్పట్లో లేవు. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలుస్తోంది. అప్పట్లో మా నాన్నగారు ఉన్నప్పుడే ఇవి ఉండి ఉంటే ఆయనకు చేయించేవాడిని. అన్నాళ్ల పాటు ఆయన బాధపడాల్సి వచ్చేది కాదు. ఆలస్యంగానైనా ఈ సరికొత్త చికిత్సలు రావడం సంతోషం.
- రాఘవేంద్ర, సీనియర్ జర్నలిస్టు