విశాఖ ఉక్కు కర్మాగారానికి(Vizag Steel Plant) ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కుకు రూ.10,000 కోట్లు ఈక్విటీ మద్దతును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంలో ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని విశాఖ ఉక్కుకు సాయం చేయడం జరిగిందని వెల్లడించారు.
అంతకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(kumaraswamy)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా నష్టాల్లో ఉన్న విశాఖ పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు రూ.11,440 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు.