ఎట్టకేలకు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. గత నాలుగేళ్లుగా ఫ్లెమింగో వలస పక్షుల పండుగను ప్రభుత్వం నిర్వహించకపోగా చంద్రబాబు సర్కారు మాత్రం చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ పక్షుల పండుగను తలపెట్టింది. దీంతో ఇప్పుడు మళ్లీ వలస పక్షుల పండుగ సందడి సూళ్లూరుపేటకు కొత్త అందాన్ని తెస్తోంది. 3 రోజులపాటు ఈ పండుగ భారీఎత్తున నిర్వహిస్తున్నారు. పక్షుల ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లకు ఈ ఫెస్టివల్ ఓ పెద్ద ఈవెంట్.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా హోలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జెసి శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళ తాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.