రోజు రోజుకు సిటీలో పెరుగుతున్న వాహనాలు, పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు, వాటివల్ల వచ్చేదుమ్మూ, దూళీ వల్ల వెలువడుతున్న వాయువల వల్ల సిటీలో వాయుకాలుష్యం పెరుగుతోంది. అయితే వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్–డై–ఆక్సైడ్ (NO2) హైదరాబాద్లో భయంకరమైన స్థాయిలో పెరుగుతుందని, దీని వల్ల అనేక రకాల రోగాలు ప్రబలే ప్రమాదముందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
100 రెట్లు పెరిగిన
గాలిలో పెరుగుతున్న నైట్రోజన్–డై–ఆక్సైడ్ రసాయనాలు కొన్ని ప్రాంతాల్లో 100 రెట్లు పెరుగుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిక జారీ చేస్తున్నారు. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది కాలుష్యానికి మూలం కాకపోయినా, భవన నిర్మాణ కార్యకలాపాలు, రోడ్డు ట్రాఫిక్, వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ఇతర కాలుష్య కారకాలతో కలిపినప్పుడు వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడి కాలుష్యానికి కారణమవుతుందంటున్నారు. గాలిలో పెరుగుతున్న నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల ప్రజారోగ్యానికి, ముఖ్యంగా పిల్లలు వృద్ధులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందంటున్నారు. నైట్రోజన్–డై–ఆక్సైడ్ తో కలుషితమైన గాలిని పీల్చడం వల్ల చిన్న పిల్లలు, వృద్దుల్లో శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడి అస్తమా వ్యాధికి దారి తీస్తుందంటున్నారు.
ఏడు మెట్రో సిటీలపై అధ్యయనం
ఇటీవల గ్రీన్‌పీస్ సంస్ధ బియాండ్ నార్త్–నైట్రోజన్ డయాక్సైడ్ పొల్యూషన్ అండ్ హెల్త్ రిస్క్అనే అంశంపై చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణే జైపూర్ అనే ఏడు మెట్రో సిటీలలో అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారంగా గతేడాది 365 రోజుల్లో 307 రోజులు హైదరాబాద్ ప్రమాదకర స్థాయిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలను ఎదుర్కొందని వెల్లడించింది.ఇది ముంబై (256 రోజులు), బెంగళూరు (295 రోజులు) కోల్‌కతా (133 రోజులు) వంటి ఇతర ప్రధాన నగరాలను అధిగమించింది. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణే జైపూర్ అనే ఏడు నగరాల్లో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలను విశ్లేషించినప్పుడు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యధికంగా నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు 41 పార్ట్స్ పర్ బిలియన్ గా ఉన్నాయని తేలింది. గచ్చిబౌలీ తరువాత స్థానంలో ఓల్డ్ సిటీ (23 పీపీబీ)), బోలారం (22 పీపీబీ ), సనత్‌నగర్ 20(పీపీబీ) స్థాయిలో ఉన్నాయని గుర్తించారు. ఈ గణాంకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన సురక్షిత పరిమితి 10 పీపీబీల కంటే రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువని సైంటిస్టులు చెపుతున్నారు.
నైట్రోజన్ డయాక్సైడ్ చాలా విషపూరితమైనది అంటున్న పర్యావరణ వేత్తలు
చాలా సందర్బాల్లో నగరంలో రక రకాల కాలుష్యాలపై జరిగే చర్చలు, సదస్సులో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, జీవజాతులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే చర్చలు జరుగుతాయి. అయితే వీటితో పాటు మనకు అత్యంత హాని కలిగించే నైట్రోజన్ డయాక్స్ రసాయనాలను విస్మరిస్తున్నారని, గాలిలో నైట్రోజన్ పెరాక్సైడ్ పెరగడమనేది ఆందోళన కలిగించే విషయని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే ది చాలా విషపూరితమైనది. “నైట్రోజన్ డయాక్సైడ్ అనేది దాదాపు కనిపించని విష వాయువుగా పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. అధికంగా వాహనాల వల్ల వెలువడే కాలుష్య కారకాలనుంచి వెలువడుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉన్నందున నైట్రోజన్ డయాక్సైడ్ కూడా సిటీలోని గాలిలో అధికంగా ఉంటుంది. నగరాల్లో నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యానికి మూలం రోడ్డు ట్రాఫిక్ గా పర్యావరణ వేత్తలు చెపుతున్నారు. ఇంధన దహన సమయంలో కార్లు, ట్రక్కులు, బస్సులు నైట్రోజన్ ఆక్సైడ్‌లను కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్తో పాటు నైట్రోజన్ డయాక్సైడ్ను కూడా విడుదల చేస్తాయని సైంటిస్టులు చెపుతున్నారు. బొగ్గు, చమురు లేదా సహజ వాయువును ఇంధన ఉత్పత్తి కోసం మండించే పరిశ్రమలు , విద్యుత్ ప్లాంట్ల నుంచి నైట్రోజన్ డయాక్స్డ్ కాలుష్యానికి గణనీయంగా దోహదం చేస్తాయంటున్నారు.
పిల్లల్లో పెరుగుతున్న అస్తమా
గ్రీన్‌పీస్ నివేదిక ప్రకారం, నైట్రోజన్ డయాక్సైడ్ గాలిని కలుషితం చేయడం వల్ల హైదరాబాద్‌లో 2,430 మంది పిల్లలు ఆస్తమా బారిన పడినట్లు అధ్యయనం వెల్లడించింది. ఈ కాలుష్య కారకం వల్ల 2019లో 2,800 మరణాలు సంభవించినట్లు నిపుణుల నివేదికలు చెపుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం నగరంలో సగటున నైట్రోజన్ డయాక్సైడ్ స్తాయి 18 పీపీబీలు ఉన్నట్లు అధ్యయనాలు ద్వారా తేలింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది
దీనిని ‘స్లో కిల్లర్’ గా పేర్కొంటున్న వైద్య నిపుణులు నైట్రోజన్డయాక్సైడ్ కాలుష్యానికి అధిక కాలం గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు , ఇప్పటికే అస్తమా జబ్బుతో బాధపడుతున్న వారిలో ఊపిరి తిత్తుల పనితీరును తగ్గిస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చడం వల్ల శరీర భాగాల్లో వాపుకు కారణమవుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అది దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధులు , గుండె సంబంధ సమస్యలకు దారి తీస్తుంది.
–డాక్టర్ శేషగిరి రావు, ఓయూ హెల్త్ సెంటర్