‘సమయం’ కాలం బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న ఏకైక నినాదంతో అనేకమంది విద్యార్థులు సైతం ఉద్యమించి మరీ సాధించిన మహోన్నత పారిశ్రామిక సౌధం.. విశాఖ ఉక్కు కర్మాగారం. ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఇది. కేవలం మూడు లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.44 వేల కోట్లను లాభాల రూపంలో విశాఖ ఉక్కు కర్మాగారం అందించింది. అలాంటి కర్మాగారం.. కొంతమంది ఉద్యోగులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలకు తోడు సొంత గనులు లేకపోవడం, సరైన సమయానికి కొన్నిసార్లు బొగ్గు అందకపోవడం, ఇతరత్రా కారణాలతో క్రమంగా కునారిల్లసాగింది. ఒకానొక సమయంలో.. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈ వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెట్టేయాలని కూడా కేంద్ర మంత్రివర్గమే నిర్ణయించింది. అదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కూడా ప్రకటించేశారు.
ఇంకేముంది.. అంతా అయిపోయిందనే అందరూ అనుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇక గతచరిత్రేనని ఉసూరుమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీనిపై గళమెత్తారు. కేంద్రాన్ని వేడుకున్నారు. బతిమాలారు. ఎలాగైనా దీన్ని కాపాడాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సుముహూర్తం కుదిరింది. ఎన్డీయే కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మంత్రాంగం ఫలించింది. దాదాపు ఏడు నెలల పాటు అవిశ్రాంతంగా ఆయన తెచ్చిన ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం తలొగ్గింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి భారీగా రూ.11,440 కోట్ల ప్యాకేజిని అందించింది.
అయితే.. ప్రస్తుతం ఈ సంస్థకు ఉన్న రూ.26,114.92 కోట్ల అప్పులను తీర్చడానికే ఈ ప్యాకేజి మొత్తం సరిపోదు. కానీ.. ఇందులో రూ.1,140 కోట్లను వర్కింగ్ కేపిటల్ రూపంలో అందిస్తున్నారు. దీనివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉన్న మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు కూడా పనిచేయడం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. దాదాపు 73 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ స్టీల్ ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి బయటకు వస్తే, దానికి కావల్సినంత డిమాండు ఉంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. అనేక ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతోంది. స్వయంగా ప్రభుత్వాలు సైతం గృహనిర్మాణ ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. వీటన్నింటికీ కూడా ఉక్కు కావాల్సిందే. దాన్ని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవడానికి బదులు.. సొంత స్టీల్ ప్లాంటు నుంచే తీసుకుంటే ధర తగ్గుతుంది, నాణ్యత ఉంటుంది, సొంత స్టీల్ ప్లాంటుకు కాస్తంత వ్యాపారం దక్కుతుంది. ఇలాంటివి చేస్తే నిజానికి ఎప్పటినుంచో విశాఖ ఉక్కు కర్మాగారం ఒడ్డున పడేది.
కనీసం ఇప్పటికైనా చంద్రబాబు, ఇతర కూటమి నేతల పుణ్యమాని.. విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్రతిష్టాత్మక సంస్థను నిలబెట్టడానికే ఈ ప్యాకేజి ప్రకటించారు. ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదని ప్యాకేజి ప్రకటన సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి భరోసా ఇచ్చారు. ప్రస్తుతానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం గురించి ఏమీ చెప్పకపోయినా.. భవిష్యత్తులో కొంత ఒడ్డున పడ్డ తర్వాత మాత్రం ఆ దిశగా ఆలోచనలుచేసేలాగే కనిపిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దేశంలోనే ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ప్యాకేజి తప్పనిసరిగా పనికొస్తుంది. ఈ ప్యాకేజీలో రూ.10,300 కోట్లు ఈక్విటీ కేపిటల్గాను, రూ.1,140 కోట్లు వర్కింగ్ కేపిటల్గాను సమకూరుస్తున్నారు. ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను యథాతథంగా… అంటే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే నడిపేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇచ్చి.. దీన్ని పదేళ్ల తర్వాత రిడీమ్ చేసుకుంటారు.
నిజానికి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంత పెద్ద సాయం అందడం ఏమీ అంత ఆషామాషీగా జరగలేదు. దీనివెనుక ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేనల అధినేతల కృషి చాలానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అంటే గత ఏడు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు దీని గురించి చేసిన కృషి అంతా ఇంతా కాదు. కేంద్రంలో తమకు ఉన్న మంత్రిపదవుల్లో ఒకటి.. ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవి తీసుకోవడం చంద్రబాబు చాణక్యమే అనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశే పరిస్థితి మారింది. ఆ రాష్ట్రానికి రాజధాని నగరం లేదు, పారిశ్రామికాభివృద్ధి లేనేలేదు. ఆదాయం కూడా అంతంతమాత్రమే. పైపెచ్చు, కేంద్ర ప్రభుత్వం విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించి.. ఇస్తామన్న ప్రత్యేక హోదా కూడా ఏదో ఒక వంక పెట్టి ఇవ్వలేదు. అయినా ఎలాగోలా రాష్ట్రాన్ని ఇప్పటివరకు పదేళ్ల పాటు నెట్టుకొచ్చారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు కర్మాగారం కాస్తా ప్రైవేటు పరం అయిపోతుందంటే.. వారి గుండెలు బద్దలైనంత పని అయ్యింది.
సరిగ్గా అలాంటి సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రధాన భాగస్వాములయ్యాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో గెలుపొందిన ఎంపీల బలం ఎన్డీయేకు చాలా అవసరం అయ్యింది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా విలువ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదే సరైన సమయమని భావించిన చంద్రబాబు.. తన రాజకీయ చాణక్యనీతి మొత్తాన్ని ప్రదర్శించారు. గడిచిన ఏడు నెలల్లో ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయన పఠించిన మంత్రాలు మూడే. అవి అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం కానివ్వకుండా కాపాడడం. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయనకు సమర్థుడైన సర్వసైన్యాధ్యక్షుడి రూపంలో పవన్ కళ్యాణ్ దొరికారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన.. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు అండగా ఉంటానని ఎన్నికలకు ముందు, తర్వాత కూడా హామీ ఇచ్చారు. అందుకోసం కేంద్రంలోని మంత్రుల మీద వీలైనంత వరకు తనవైపు నుంచి కూడా ఒత్తిడి తెచ్చారు. ఇక చంద్రబాబైతే ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి.. ఇలా అందరితోనూ కలిసినప్పుడల్లా విశాఖ ఉక్కు గురించే ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో అయితే.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహారాష్ట్ర వెళ్లి, అక్కడినుంచి ఢిల్లీ రావడానికి ఆలస్యం అయ్యింది. ఆమె రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వస్తే.. అప్పటినుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి 2.30 వరకు చంద్రబాబు, కుమారస్వామి ఆమెతో సమావేశం కొనసాగించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునేందుకు ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అంతటి ఉక్కు సంకల్పం కొనసాగించడం వల్లే ఉక్కు కర్మాగారం ఇప్పుడు నిలదొక్కుకోగలిగింది. విశాఖ ఉక్కు.. 100% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు రూ.7,686.24 కోట్ల ఆస్తులు, రూ.26,114.92 కోట్ల అప్పులున్నాయి. 2023 మార్చి 31 నాటికి సంస్థ నెట్ వర్త్ మైనస్ రూ.4,538 కోట్లకు పడిపోయింది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉండటంతో మూలధన వ్యయం కోసం బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ రూపంలో రూ.10,300 కోట్లు సమకూర్చడం వల్ల ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి, దశలవారీగా పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మొదలుపెట్టడానికి వీలవుతుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల జీవనోపాధికి గ్యారంటీ ఉంటుంది. ఈ నెలలోనే ఉక్కు కర్మాగారంలోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో మొదలవుతాయి. ఆగస్టు నాటికల్లా మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పనిచేస్తాయి. విశాఖ ఉక్కు బ్యాంకులకు రూ.18 వేల కోట్లు, మెటీరియల్ సరఫరాదారులకు రూ.17 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. వాటన్నింటినీ అధిగమించడానికి ఈ ప్యాకేజి కొంతవరకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కేవలం ఇప్పుడిచ్చిన మొత్తంతోనే అప్పులన్నీ తీర్చేయడం సాధ్యం కాకపోవచ్చు గానీ, దాంతో ఉత్పత్తి తిరిగి మొదలైతే వ్యాపారం కొనసాగి స్టీల్ ప్లాంటు తన సొంత కాళ్ల మీద నిలబడగలిగే అవకాశం ఉంటుంది. ఈ సంస్థకు ఇప్పటికే ఒడిశాలో కేప్టివ్ మైన్ ఉంది. కానీ అక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. వచ్చే ఆగస్టు నాటికి మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లతో 92% ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో తెలుగు ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి… కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన కుమారస్వామికి.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంటే ముందునుంచి అభిమానం మెండు. స్వతహాగా సినీ నిర్మాత కూడా అయిన కుమారస్వామికి టాలీవుడ్ నటీనటులు, నిర్మాతలు, దర్శకులతో కూడా అనుబంధం ఉంది. ఎన్డీయే భాగస్వామి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సైతం ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. నిజానికి అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంరక్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరికంటే ఆయన పది రెట్లు ఎక్కువగా శ్రద్ధ పెట్టి పని చేయడం వల్లే ఈ భారీ ఆర్థిక ప్యాకేజి రావడం సాధ్యమైంది. ఆయన కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే స్టీలు ప్లాంటును సందర్శించి… ఒక రాత్రి అంతా అక్కడే ఉన్నారు. అప్పుడే ఆయన ప్లాంటులోని కార్మికులు, ఉద్యోగులు, అధికారులందరితో మాట్లాడి, వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న ఆస్తిపాస్తులు, మొత్తం అప్పులు, వాటికి కారణాలు అన్నీ క్షుణ్ణంగా గమనించారు. అప్పుడే ప్లాంటును కాపాడి తీరుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టుకున్నారు.
సొంత గనులు ఎంతైనా అవసరం
మన దేశంలో ఉన్న చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ముడి ఇనుము గనులు (క్యాప్టివ్ మైన్లు) ఉన్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రం ఇంతవరకు అలాంటి గనులను కేటాయించలేదు. దీనివల్ల ముడి ఇనుమును మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సొంత గనులు ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ సంస్థలకు మాత్రం ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. ఇలా కేవలం ఒక్క ముడి ఇనుము కోసమే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రతియేటా దాదాపు రూ.1,500–-2,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు ఏకంగా 13% వడ్డీ చెల్లిస్తున్నారు. విశాఖ స్టీలు ప్లాంటుకు అనుబంధ సంస్థ అయిన ఓఎండీసీ అధీనంలో ఒడిశాలో ఆరు గనులు ఉన్నా.. వాటిలో మైనింగ్ అనుమతులకు కాలం తీరిపోయింది. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలదిల్లా గనులతో పాటు.. గంగవరం పోర్టును కలిపే రహదారిని కూడా వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేటాయించాలని చాలాకాలం క్రితమే ప్రతిపాదించారు. దానివల్ల ముడి ఇనుముతో పాటు.. దిగుమతి, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంత గనులు మాత్రం దక్కలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గనుల విధానంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలైనా వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాల్సిందే తప్ప.. నేరుగా కేటాయించే పరిస్థితి లేదు.
యాజమాన్యం మారాల్సిందే
విశాఖ ఉక్కు కర్మాగారం ఒకప్పుడు కేవలం 3 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో పనిచేసేది. అప్పుడే కేంద్ర ఖజానాకు ఏకంగా రూ.44వేల కోట్ల ఆదాయాన్ని అందించింది. కానీ, ఉత్పత్తి సామర్థ్యాన్ని 63 లక్షల టన్నులకు, ఆ తర్వాత 73 లక్షల టన్నులకు విస్తరించడంతోనే దీని తిరోగమనం ప్రారంభమైంది. ఇందుకు ప్రధాన కారణం యాజమాన్యంలోని కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు. చాలా కాలం నుంచి ఇక్కడి అధికారులు సొంత ప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేస్తూ.. కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టేశారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి దుర్లక్షణాలు ఎక్కువ కావడంతో కొద్దిమంది అధికారులు తమ జేబులు నింపుకొంటూ స్టీలు ప్లాంటును నష్టాలపాలు చేశారు. కొంతమంది నిజాయతీపరులైన అధికారులు ఎలాగైనా ప్లాంటును నిలబెట్టాలని అహోరాత్రాలు కృషిచేస్తున్నా, వారిని విశాఖ నుంచి దూరంగా ప్లాంటుకు ఉన్న ఇతర గనుల్లోకి పంపేసి లూప్లైన్లో పెట్టారు. పాండురంగారావు అనే ఒక ఉన్నతాధికారి విశాఖ స్టీలుప్లాంటులో ఉన్నప్పుడు జనరల్ మేనేజర్లు, డైరెక్టర్ల అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. దాంతో ఆయనను అక్కడినుంచి దూరంగా ఎక్కడో కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని సున్నపురాతి గనులకు బదిలీచేశారు. దానివల్ల అలాంటి అధికారులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే.. ఆ తర్వాతి కాలంలో సదరు పాండురంగారావు ఏకంగా ప్రధానమంత్రికి గనుల వ్యవహారాల సలహాదారు అయ్యారు. ప్రస్తుతం తన పదవీ విరమణ అనంతర జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం అందించిన సాయం గురించి ఆయన దగ్గర నేను ప్రస్తావించినప్పుడు.. ఆయన గొంతులో ఎక్కడలేని ఆనందం నాకు తెలిసింది. అదే సమయంలో ఉన్నతాధికారుల్లో మార్పు రానంత వరకు ఎంత సాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న ఆయన మాటలు అక్షరసత్యాలుగా గోచరించాయి. కేంద్రం విశాఖ ఉక్కుకు సమర్థత, నైపుణ్యం గల యాజమాన్యాన్ని నియమించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు అలాంటివారు లేకపోవడం వల్లనే కదా.. చంద్రబాబు నోటివెంట అలాంటి మాటలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తించి.. అక్కడ ప్రస్తుతం ఉన్న అవినీతిపరులందరి భరతం పట్టాలి. అప్పుడే చేసిన సాయానికి సార్థకత లభిస్తుంది.