Sunday, January 19, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Rumble strips: రం‘బుల్' స్ట్రిప్​ స్పీడ్ బ్రేకర్లతో రోగాలు

Rumble strips: రం‘బుల్’ స్ట్రిప్​ స్పీడ్ బ్రేకర్లతో రోగాలు

సిటీ రోడ్స్ అంటేనే హెల్

రోడ్లపై వాహనాల వేగాన్నినిరోధించడానికి ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ (సిల్వర్ వైట్ స్ట్రిప్స్) వాహనదారులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ వల్ల వాహనాలు రిపేరుకు వస్తుండగా, తాము అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు.

- Advertisement -

మనుషులు హాస్పిటల్ కు, వాహనాలు రిపేర్ కి!

ముఖ్యంగా ఈ రంబుల్ స్ర్టిప్ స్పీడ్ బ్రేకర్స్ పై వెళుతున్న సమయంలో బైక్లు, కార్లు జంప్ చేయడం వల్ల బ్యాక్పెయిన్, వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు తెలెత్తుతున్నాయి. నగరంలో అనునిత్యం ట్రాపిక్ జామ్లతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఈ రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ వల్ల అటు సమయం వృథా కావడంతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. ఈ రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ నగరంలోని ప్రధాన రోడ్లు అయిన సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్, హబ్సిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలోని వాహనాల రద్దీ అధికంగా ఉండే చాలా ప్రాంతాల్లో వీటిని లెక్కకు మించి ఏర్పాటు చేశారు. కేవలం రహదారులే కాదు, చిన్న చిన్న కాలనీలలో కూడా ఈ రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ వేయడం గమనార్హం.

వాహనాల స్పీడ్ తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్
నగరంలో వాహనాల స్పీడ్ను తగ్గించాలన్న సంకల్పంతో ట్రాఫిక్ విభాగం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోనిప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే రానురాను వాహనాల రద్దీ పెరగడంతో రంబుల్ స్ర్టిప్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయం మొదలుపెట్టారు. నగరంలో రద్దీగా ఉండే రోడ్లపై రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేవారు. తరువాతి క్రమంలో వాటిని ఎక్కడ పడితే అక్కడ, లెక్కకు మించి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రధాన రోడ్లతో రంబుల్ స్ర్టిప్ స్పీడ్ బ్రేకర్స్ ప్రతి 200 మీట్లకు ఒకటి ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 100 అడుగుల దూరం కూడా మించడం లేదు. జాతీయ రోడ్డు మార్గదర్శకాల ప్రకారం ఒక చోట వాటి సంఖ్య ఆరు లైన్లకు మించరాదని చెపుతున్నా ఎక్కడ చూసినా అవి 10 లైన్ల కంటే ఎక్కువగానే ఏర్పాటు చేశారు. జాతీయ రోడ్డు కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం హైవేలు, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో వాహనాల స్పీడ్ను నియంత్రించడంలో భాగంగా రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు మాత్రం వాటిని నగరంలోనిప్రధాన రోడ్లతో పాటు చిన్ని చిన్న కాలనీ రోడ్లపై కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాటిని లెక్కకు మించి రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారని , దీని వల్ల తమ వాహనాలు కూడా పాడవుతున్నాయని వాహనదారులు, ముఖ్యంగా ఆటోవాలాలు పేర్కొంటున్నారు.
మార్గదర్శకాలు ఏమంటున్నాయి?
నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలలో రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని నిబంధనలు చెపుతున్నాయి. ఈ రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ ఎత్తు 20 నుంచి 30 మిల్లీ మీటర్లు, 200 నుంచి 300 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఒక మీటరు గ్యాప్లో ఒక్కో చోట వాటి సంఖ్య ఆరుకు మించకుండా వేయాలని మార్గదర్శకాలు చెపుతున్నాయి. అయితే రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ సంఖ్య ఏ రోడ్డులో చూసినా పదికి మించి ఉంటున్నాయని వాహనదారులు చెపుతున్నారు. దీంతో ఈ రోడ్లపై వెళ్లే వాహనదారులు వెన్నునొప్పి, డిస్క్ నొప్పి, స్పాండిలైటీస్ నొప్పులతో బాధపడుతున్నట్లు చెపుతున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే మహిళలు, వాహనాల వెనుకాల కూర్చుని వెళ్లే మహిళలు సైతం తీవ్రమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నట్లు చెపుతున్నారు. అలాగే నగరంలో ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు కూడా సైజ్ను పెంచి వేస్తున్నారు. ఒక్క స్సీడ్ బ్రేకరు ఒక్క ఫీటుకు మంచి వేస్తున్నారు. దీంతో అవి రోడ్డుకు అడ్డంగా ఒక కట్టలా మారాయి. వీటిని గమనించకుండా స్పీడ్ గా వెళితే బొగ్గబోర్ల పడి ప్రమాదాల బారిన పడినట్లు పలువురు వాహనదారులు చెపుతున్నారు.

రంబుల్స్ తో వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
“ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నంగా రంబుల్ స్ట్రిప్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. రోడ్డుపై అధిక మందంతో, అధిక సంఖ్యలో అమర్చిన ప్రస్తుత రంబుల్స్ స్ట్రిప్స్లో సాంకేతికపరమైన లోపాలను జీహెచ్ఎంసీ గుర్తించింది. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి ఇప్పటికే కూకట్పల్లి జోన్ పరిధిలో సర్కిళ్ల వారిగా వేసిన రంబుల్ స్ట్రిప్స్ పై సర్వే నిర్వహించాం. 15 మిల్లీ మీటర్లు ఉన్న వాటిని 5 మిల్లీ మీటర్లకు సరిచేస్తాం. అనవసరంగా వేసిన ప్రాంతాల్లో పూర్తిగా తొలగిస్తాం”.
–చిన్నా రెడ్డి,జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్
రంబుల్ స్ట్రిప్స్ వల్ల బ్యాక్ పెయిన్ సమస్యలు
“నగర రోడ్లపై వాహనాల స్పీడ్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వెన్నెముక సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో స్పాండిలైటీస్ సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి రోడ్లపై తరచూ వెళితే వెన్నెముక పూసల్లో గ్యాప్ వచ్చి అది కాస్తా దీర్గకాలిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదముంది”.
–డాక్టర్ విగ్నేష్ కుమార్,ఆర్టోపెడిక్ వైద్యులు
వెన్నెముకపై ప్రభావం పడకుండా వాటిని ఏర్పాటు చేయాలి
“నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం వల్ల ప్రతి రోజు బైక్ పై వెళుతుంటాను. నగరంలో ఏ రోడ్డులో చూసినా ఈ రంబుల్ స్ట్రిప్స్ లెక్కకు మించి ఉన్నాయి. దీనివల్ల వాహనదారులకు ఆరోగ్య సమస్యలే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. వెన్నెముకపై ప్రభావం పడకుండా వాటిని ఏర్పాటు చేయాలి. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిబంధనల ప్రకారం వాటిని ఏర్పాటు చేయాలి”.
–మహ్మద్ ఇస్మాయిల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, నాచారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News