బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం డీసీపీ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించామని తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించామని.. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడన్నారు. ఆరు నెలల క్రితం ముంబై వచ్చాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ చేపడతామన్నారు.
కాగా సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై కత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి వివరాలను దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లకు పంపించారు. దీంతో శనివారం రాత్రి నిందితుడిని ఛత్తీస్‌గఢ్ దుర్గ్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని ముంబై పోలీసులకు అప్పగించారు.