ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశంసలు కురిపించారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్(NDRF) 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, ఎన్ఐడీఎం సౌత్ క్యాంపస్ అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న చంద్రబాబు వెనక ప్రధాని మోదీ కొండలా అండగా ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు, మోదీ జోడీ మూడింతలతో ఏపీ అభివృద్ధి సాధిస్తుందన్నారు. చంద్రబాబు రేయింబవళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు మూడు లక్షల కోట్ల అభివృద్ధికి సాయం అందించడం జరిగిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అయిన విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశామని.. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని వివరించారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాజెక్టును అటకెక్కించిందని షా విమర్శించారు.