కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ పురస్కారాల(Padma Awards)పై తెలుగు సీనియర్ నటుడు వీకే నరేశ్(Actor Naresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్(NTR)కు భారతరత్న.. సీనియర్ నటి, దివంగత విజయ నిర్మల(Vijaya Nirmala)కు పద్మ్ పురస్కారం రావాలని తెలిపారు. తన అమ్మ అయిన విజయ నిర్మలకు పద్మ అవార్డ్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ అని వివరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తెలంగాణ సీఎంగా ఉన్న సమయంలో పద్మ పురస్కారం కోసం సిఫారసు చేశారని గుర్తు చేశారు. అయినా కానీ విజయ నిర్మలకు అవార్డు రాకపోవడం బాధాకరమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారని వెల్లడించారు. తెలుగు వారికి అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని నరేశ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నరేశ్ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.