బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా నిందితుడు మహ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి యూపీఐ పేమెంట్ చేశాడని ఓ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. దీంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి థానేలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కాగా ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుడితో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదు రోజుల్లోగా నివేదికను అందించాలని బాంద్రా కోర్టు పోలీసులను ఆదేశించిన విషయం విధితమే. దీంతో వీలైనంత త్వరగా నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు.