వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram gopal Varma) దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన చిత్రం ‘సత్య’(Satya). 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా గురించి ఆర్జీవీ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘‘27 ఏళ్ల తర్వాత మొదటిసారి ‘సత్య’ చూశాను. నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కేవలం సినిమా కోసం కాదు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తొచ్చాయి. ఒక సినిమాను చిత్రీకరించడమంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. నేను తీసిన చిత్రాలు హిట్ అయినా.. కాకపోయినా.. నేను పనిలో నిమగ్నమై ముందుకు సాగుతున్నాను. రెండు రోజుల క్రితం ‘సత్య’ సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనిపించింది.
‘సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. రంగీలా, సత్య వంటి గొప్ప చిత్రాలను నేను తెరకెక్కించాను. ఇప్పటి సాంకేతికతతో ఇంకా గొప్ప చిత్రాలు తీయొచ్చు. కానీ నేను అలా చేయలేకపోయాను. నా ప్రతిభకు ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ నేను వాటిని చూడలేకపోయాను. అందుకే నా కన్నీళ్లను తుడుచుకుంటూ రెండు రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా.
‘సత్య’ తీసిన తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశాను. అవి కూడా ‘సత్య’ అంత బాగుంటాయా అని నన్ను ఎవరూ అడగలేదు. ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు ‘సత్య’ను కచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నాను. చివరగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉంది. దానిని గౌరవంగా పూర్తిచేయాలనుకుంటున్నా. సత్య లాంటి సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నాను. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నా సినిమా ‘సత్య’పై ప్రమాణం చేసి చెబుతున్నాను’’ అని రాసుకొచ్చారు.