దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి(RG Kar Incident)ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన నిందితుడికి కోల్‌కతా సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడుతుందని భావించామని.. కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందన్నారు. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని వెల్లడించారు. ఒకవేళ కోల్‌కతా పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని పేర్కొన్నారు.
మరోవైపు తీర్పుపై విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టు ఎదుట విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. కాగా దోషికి జీవితఖైదు విధించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని.. అందుకే మరణశిక్ష విధించలేదని అభిప్రాయపడింది.