వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్ట్లే, ఏబీబీ, నోవార్టీస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృధుల్ కుమార్ వివరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్‌కు ముఖ్యమంత్రి చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్‌కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్నిరంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని తెలిపారు.
స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో భేటీ :
తమ భేటీ అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, హై క్వాలిటీ ఇండిస్ట్రియల్ కాంపోనెంట్స్ అండ్ కస్టమ్ ఇంజినీర్డ్ సొల్యూషన్స్ సంస్థ అయిన ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, టెక్స్‌టైల్స్ రంగానికి చెందిన ‘స్విస్ టెక్స్‌టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవకాశాలు :
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానీ మాన్యుఫాక్చరింగ్ కోసం సౌకర్యాలు కల్పించడం, కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీలతో స్విస్ రీసెర్చ్ సంస్థలు కలిసి పనిచేయడం, ఇన్నోవేషన్ హబ్‌లు – ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్‌మెన్’ కంపెనీ ముందుకురావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని… వీటిని ‘ఓర్లికాన్’ వినియోగించుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అడ్వాన్డ్స్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీవైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయొచ్చని ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’కు తెలిపారు. ఏపీలోని టెక్స్‌టైల్ రంగంలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం రావాల్సిందిగా ‘స్విస్ టెక్స్‌టైల్స్’ను సీఎం ఆహ్వానించారు.
జ్యూరిచ్‌లో అపూర్వ స్వాగతం :
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాసేపు వారితో ముచ్చటించి ఉత్సాహ పరిచారు.
కలుసుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు :
జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.