కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ నాలుగేళ్లు పోరాడదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినప్పటికీ పోరాటపటిమ పోలేదన్న రీతిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం పోరాడుతుందన్నారు. హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారన్నారు. అయితే కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు.
కరోనా కాలంలో కేసీఆర్ ప్రెస్‌మీట్‌కి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురు చూశారన్నారు. ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ అదే అంగన్వాడీ టీచర్లకు రూ.4500 జీతాన్ని రూ.13,650లకి పెంచారని తెలిపారు. అలాగే దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ నిలిపారని వివరించారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని కోరారు. ఇక నుంచి తెలంగాణ భవన్.. తెలంగాణ జనతా గ్యారేజ్ అని కేటీఆర్ వెల్లడించారు.