టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోలు ప్రావీన్స్‌లోని కార్టల్‌కాయా ప్రావీన్స్‌లోని స్కీ రిసార్ట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 66 మంది మరణించారు. సుమారుగా 51 మంది గాయపడినట్లు టర్కీ ఆరోగ్య మంత్రి తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున తుర్కియేలోని ప్రముఖ స్కీ రిసార్ట్‌లో జరిగినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు.
ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్లు (185 మైళ్లు) దూరంలో ఉన్న బోలు ప్రావిన్స్‌లోని కొరోగ్లు పర్వతాలలో కర్తాల్‌కాయ రిసార్ట్‌లోని గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో సంభవించిన విపత్తులో క్షతగాత్రుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం టర్కీలో పాఠశాలలకు సెమిస్టర్ సెలవులు కావడంతో ఈ ప్రాంతంలో హోటళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై ఆరోగ్య మంత్రి కెమల్ మెమిసోగ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని విలేకరులతో పేర్కొన్నారు. ఇక గాయపడిన వారిలో కనీసం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో 17 మంది చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రి కెమల్ మెమిసోగ్లు తెలిపారు.
ఇక ఈ ప్రమాద సమయంలో హోటల్ లో మొత్తం 238 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:27 గంటలకు అగ్నిప్రమాదం జరగగా 4:15 నిమిషాలకు అగ్నిమాపక శాఖ స్పందించి మంటలు ఆర్పడం ప్రారంభించింది. అయితే అప్పటికే అనేక మంది అగ్నికి ఆహుతయ్యారని స్థానిక మీడియా చెబుతోంది.