దేశవ్యాప్తంగా టెక్నాలజీ పెరగడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసే ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) తాజాగా నకిలీ వెబ్‌సైట్లను ఎలా గుర్తించాలనే దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
“ఫేక్ వెబ్‌సైట్స్(Fake Websites) నమ్మి అమాయక ప్రజలు లక్షల్లో మోసపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్-ఒరిజినల్ వెబ్‌సైట్‌కు మధ్య తేడాను గుర్తించలేక సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఏదైనా వెబ్‌సైట్ పేరులో యూఆర్ఎల్(URL) ఉంటే కచ్చితంగా దీనికి ముందు హెచ్‌టీటీపీ(HTTP) ఉంటుంది. అలా లేకుంటే అది నకిలీ వెబ్ సైట్. అదేవిధంగా ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మరో వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంటే అది నకిలీదని గుర్తించాలి. బాధితులు వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి” అని సజ్జనార్ సూచించారు.