దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. శ్రీలంకలో జరిగిన ఈ ట్రోఫీలో.. భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టిగా రాణించిందని తెలిపింది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్స్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 118 పరుగులకే ఆలౌటైంది. భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 40 బంతుల్లోనే 73 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అనంతరం భారత బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టును సమూలంగా దెబ్బతీశారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ిక కెప్టెన్ విక్రాంత్ కేనీ రెండు వికెట్లు తీయగా, రవీంద్ర సంటే రెండు వికెట్లు తీసి విజయం సొంతం చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విక్రాంత్ కేనీ మాట్లాడుతూ.. ఈ విజయం తమకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. జట్టులో ప్రతి ఆటగాడి కృషితోనే ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
ఇక జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ, తన జట్టు అసాధారణ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ప్రతి పరిస్థితిని అధిగమిస్తూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, ఈ విజయంతో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు కొత్త ఎత్తులకు చేరుకుందని కోచ్ అన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఇది భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడి గౌరవంగా నిలుస్తుంది.. అని DCCI ప్రకటించింది. ఈ అద్భుత గెలుపుతో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.