కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. వీలైనంత వరకు రాజధాని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అటు ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంకు, హడ్కో వంటి సంస్థలతో నిధుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే అమరావతికి హడ్కో శుభవార్త అందించింది. అమరావతి నిర్మాణానికి రూ.11వేల కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు మంత్రి నారాయణ(Narayana) వెల్లడించారు. నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో ఇకపై రాజధాని పనులు వేగవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో మంత్రి నారాయణ సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగంపై వివరించారు. తాజాగా ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలోనూ దీనిపై చర్చించడంతో నిధుల విడుదలకు ఆమోదం లభించింది. దీంతో అమరావతి పనులు చకచకా జరగనున్నాయి. మూడేళ్లలో ప్రజాప్రతినిధుల భవనాలతో, పాలనా పరమైన శాశ్వత భవనాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.