ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి.. ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన 17 సీజన్లలో RCB ఒక్కసారి కూడా కప్ సొంతం చేసుకోలేదు. దీంతో ఆ టీం ఎప్పుడు ట్రోఫీ సొంతం చేసుకుంటుందా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి ఈ సాలా కప్ నమ్‌దే అనేలా ఐపీఎల్ మొదలు పెడుతూ.. ఒట్టి చేతులతో వెళ్లిపోవడం RCBకి కామన్ అయిపోయింది. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాడుతున్నప్పటికీ.. మిగిలిన ఆటగాళ్ల నుంచి మద్దతు లేకపోవడంతో ఓటమి తప్పట్లేదు.
ఐపీఎల్ విన్నర్ గా ఆర్సీబీ నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు దీనికోసం వారు చేయని పూజలు లేవు. తాజాగా ఓ అభిమాని.. ఆర్సీబీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో ఆర్సీబీ వీరాభిమాని.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి గంగాస్నానం చేయించాడు. త్రివేణి సంగమం వద్ద గంగానది పవిత్ర జలంలో ఆర్సీబీ జెర్సీని మూడుసార్లు ముంచాడు. అనంతరం ఆర్సీబీ ఈసారి కప్ గెలవాలని ప్రత్యేకంగా పూజలు చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుంభమేళాలో జెర్సీకి పుణ్యస్నానాలు చేసిన అభిమాని కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ వీడియో చూసిన బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 18వ సీజన్.. ఆర్సీబీదే అంటూ అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లక్కీ నంబర్ 18.. అని అందుకే ఈ సీజన్ లో విరాట్ విజృంభిస్తాడని జోస్యం చెబుతున్నారు.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవల తెలిపారు. మే 25న ఫైనల్ ఉంటుంది. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో అన్ని ప్రాంఛైజీలు.. కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసి పటిష్టంగా కనిపిస్తున్నారు. మరి ఐపీఎల్ 18 ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.