ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్యలకు సీఎం చంద్రబాబు భయపడుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు ? అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారు ? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు ?
ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారు. ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు గారు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే.
అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ACBని సైతం రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనం. అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజం. మోడీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయండి. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించండి. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండి.” అని షర్మిల పేర్కొన్నారు.