దావోస్(Davos) పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపుతున్నారు. తాజాగా కాగ్నిజెంట్(Cognizant) సీఈవో రవికుమార్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని తెలిపారు.
ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖ వంటి టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిల్లో హైస్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీకి రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని వివరించారు. దీనిపై కాగ్నిజెంట్ సీఈవో సానుకూలంగా స్పందించారు. 80 వేల మంది ఉద్యోగులను టైర్-1 నుంచి టైర్-2 సిటీలకు మార్చడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. దీంతో త్వరలోనే కాగ్నిజెంట్ నుంచి ఏపీకి గుడ్ న్యూస్ లభించనుందని వెల్లడించారు.