ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections)కు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచార అస్త్రాలను రంగంలోకి దించుతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ఆప్, ఈసారి ఎలాగైనా దేశ రాజధానిలో పాగా వేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనశ్ సిసోడియా(Manish Sisodia) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని తెలిపారు. ఆఫర్ తిరస్కరిస్తే జైలులోనే ఉండిపోతావ్ అని బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆరోపించారు.
బీజేపీలో చేరితే ఆప్ పార్టీని విచ్ఛిన్నం చేస్తామని ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీనికి అంగీకరించకుంటే సుదీర్ఘకాలంపాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమని మండిపడ్డారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో పనిలేదని అధికారం కోసమే బీజేపీ ఆరాటమని విమర్శించారు. ఎవరైనా సరే వారి మాట వినకుంటే జైలుకు పంపుతారన్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించి విడుదలయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పురా నియోజకవర్గం నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా..8న ఫలితాలు వెల్లడికానున్నాయి.